సీఎం జగన్ ఏపీ రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా యొక్క నియంత్రణపై సమీక్ష చేసిన సీఎం జగన్ వైద్యం కోసం ప్రజలు ఎందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తుందో ఆలోచించాలని అధికారులను సూచించారు. జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన కేంద్రాల్లో హెల్త్ హబ్ ఏర్పాట్లు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఏపీ ప్రజలు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా సీఎం జగన్ చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల ఈ హెల్త్ హబ్ లను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన నగరాలైన విజయవాడ, తిరుపతి, రాజమండ్రి పట్టణాలలో కూడా హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలన్నారు.

ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని, ఒక్కొక్క ఆస్పత్రికి ఐదు ఎకరాల చొప్పున స్థలం కేటాయించాలని చెప్పారు. మూడు సంవత్సరాల్లో కనీసం 100 కోట్లు పెట్టుబడి పెట్టె ఆస్పత్రులకు ఈ భూములను ఇవ్వాలని ఆయన చెప్పారు. దీనివల్ల ఏపీలో కనీసం 80 మల్టీ, సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ రాష్ట్రానికి వస్తాయన్నారు. అంతేకాదు, ప్రభుత్వం తరపున కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు మరియు నర్సింగ్ కాలేజీలు వస్తున్నట్లు ఆయన చెప్పారు.

దీని కారణంగా ఆరోగ్య రంగం బలోపేతం కావడంతోపాటు, సర్కార్ ప్రోత్సాహం కారణంగా ప్రైవేట్ రంగంలో కూడా మంచి హాస్పటల్స్ వస్తాయని అభిప్రాయపడ్డారు సీఎం జగన్. దీని వల్ల టెరిషరీ కేర్ విస్తృతంగా మెరుగుపడుతుందని, ప్రజలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు కూడా మంచి ప్రమాణాలతో వైద్యం అందుతుందన్నారు. నెల రోజుల్లోనే ఈ కొత్త పాలసీ ని తీసుకురావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

x