తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించబోతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఎస్ ఎస్ రాజమౌళి భారీస్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే గత కొన్ని రోజులుగా, స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 1 న మూవీ మేకర్స్ ఫ్రెండ్ షిప్ సాంగ్ ను విడుదల చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు ‘దోస్తీ’ పేరుతో మొదటి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాట ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది మరియు దీనిని ఐదుగురు ప్రఖ్యాత సింగర్స్ పాడారు.

ఈ పాటను తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుధ్ రవిచందర్, మలయాళం లో విజయ్ యేసుదాస్, కన్నడ లో యాజిన్ నిజ‌ర్, హిందీలో అమిత్ త్రివేది పాడారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, మదన్ కర్కి, రియా ముఖర్జీ, ఆజాద్ వరదరాజ్, మరియు మంకోంబు గోపాలకృష్ణన్ ఈ పాట యొక్క సాహిత్యాన్ని వరుసగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో రాశారు.

గాయకులతో పాటు సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి ఉన్న ఒక ప్రత్యేక పోస్టర్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. ప్రస్తుతం అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాట షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో జరిగింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 న విడుదల చేయడానికి మేకర్స్ యోచిస్తున్నారు.

ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవ్ గన్, రాహుల్ రామకృష్ణ, శ్రీయ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

x