Uppena Movie Review

ఉప్పెన చిత్రంతో  మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ద్వారానే కృతి శెట్టి హీరోయిన్‌గా మరియు బుచ్చిబాబు సనా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంకు సంబంధించిన టీజర్ మరియు టైలర్లే కాకుండా పాటలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 12న విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పెన కథ:

రయణం ( విజయ్ సేతుపతి) ఓ గ్రామ పెద్ద, ఈయన ప్రాణం పోయినా పర్వాలేదు.. పరువు పోకూడదనే పట్టుదల ఉన్న వ్యక్తి . పరువు కోసం ఎంతటి దారుణానికికైనా పాల్పడుతాడు. ఈయన కుమార్తె బేబమ్మ అలియాస్ సంగీత (కృతి శెట్టి). తన కూతురు ఎక్కడ ప్రేమ వలలో పడుతుందో, తన పరువు ఎక్కడ తీస్తుందో అనే భయంతో కుర్రాళ్ల గాలి తగలకుండా లేడీస్‌ కాలేజీలో చదివిస్తాడు. తన గ్రామానికి కూతురు కోసం ప్రత్యేఖము‌గా ఓ బస్సును వేయిస్తాడు.

అయినప్పటికి రయణం కూతురు అయిన బేబమ్మను చిన్నప్పటి నుండి ప్రేమిస్తుంటాడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్). ఇంతలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆశీతో తిరుగుతుందనే విషయం రయణంకి తెలిసి బేబమ్మను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఆశీ, బేబమ్మ వెళ్లిపోతారు. రయణం కంటపడకుండా పూరి, కోల్‌కత్తా, గ్యాంగ్ టక్ ప్రాంతాల్లో తిరుగుతారు. కానీ ఓ రోజు రయణానికి బేబమ్మను ఆశీ అప్పగిస్తాడు.

తన ప్రాణం కన్నా ప్రేమించిన బేబమ్మను ఆశీ ఎందుకు దూరం చేసుకొన్నాడు అనేది ఈ కథలో ట్విస్ట్. ఆశీ చేసిన పనికి బేబమ్మ ఎలా స్పందించింది? ఆశీ వదిలేసిన తర్వాత బేబమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది.? బేబమ్మ కోసం రయణం ఎలా తపించాడు? ప్రేమను రయణం వ్యతిరేకించడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఉప్పెన చిత్రం కథ.

 ఉప్పెన తొలిభాగం:

రయణం పాత్రలో విజయ్ సేతుపతి ఎంట్రీతో సినిమా కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. రయణం చేసే కొన్ని పనులు ఆసక్తిని, కథపై క్యూరియాసిటీని కలిగిస్తాయి. ఇక వైష్ణవ్ తేజ్ ఎంట్రీ మంచి మాస్ ఎలిమెంట్స్‌తో చక్క‌గా లాంచ్ అయిందని అనిపిస్తుంది. ఇక ఆశీ మరియు బేబమ్మ మధ్య లవ్, రొమాంటిక్ సీన్లు రొటీన్ కథలా అనిపిస్తాయి. ఈ ఉప్పెన చిత్రం వీక్షిస్తున్నంతసేపు వేరు వేరు సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు తలంపుకు వస్తాయి. కథను తొలిభాగం మరీ లాగదీసి చెప్పారా అనే అనుభవం వస్తుంది. ఫస్టాఫ్ చూస్తే ఇంత ల్యాగా అనే ఫీలింగ్ రావడానికి పసలేని సన్నివేశాలే కారణం అని చెప్పవచ్చు.

ఉప్పెన రెండోభాగం: 

ఇక ఉప్పెన సెకండ్ హాఫ్ లో దర్శకుడు తన చేతికి, ప్రతిభకు మంచి పదును పట్టారు. ఆశీ, బేబమ్మ వెళ్లిపోయిన తర్వాత సన్నివేశాలు మరీ కొత్తదనం లేనట్టుగా అనిపిస్తాయి. చాలా చిత్రాల్లో ఉండే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఈ మూవీకి క్లైమాక్స్‌లో రీవీల్‌ అయ్యే ఓ ట్విస్ట్‌ మాత్రము హైలెట్‌ అని చెప్పొచ్చు. ఆశీ తండ్రి అయిన జాలయ్యకు సంబంధించిన సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ నుండి చివరి వరకు వచ్చే సీన్లు మంచి ఫీలింగును కలిగిస్తాయి. ఆఖరిలో కృతి శెట్టి మరియు విజయ్ సేతుపతి మధ్య వచ్చే సీన్లు అందరిని ఆకర్షించేలా ఉంటాయి. 

డైరెక్టర్ ప్రతిభ:

విలన్‌కు సంబంధించిన కొన్ని సీన్లకు తన బీజీయంతో ప్రాణం పోశాడు. శ్యామ్ దత్ విజువల్స్‌ బాగున్నాయి. సెకాండాఫ్‌లో కొన్ని చోట్లు తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి దగ్గట్టుగా ఉన్నాయి. మొత్తంగా ప్రేమకు సరికొత్త నిర్వచనంతో జనాన్ని మెప్పించాడని చెప్పచ్చు.  

పేద, గొప్ప కుటుంబాల అతి సాధారణమైన పాయింట్‌కు తనదైన శైలిలో దర్శకుడు బుచ్చిబాబు రంగులు దిద్దారు. తొలి చిత్ర దర్శకుడిగా ఎక్కడా కనిపించరు. బుచ్చిబాబు రాసిన డైలాగ్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. చిత్రం చివరిలో కథను చెప్పిన విధానము మరియు క్లిష్టమైన అంశాన్ని తెర మీద చూపిన విధానం బాగుందని చెప్పవచ్చు. దర్శకేంద్రుడిగా బుచ్చిబాబు పెద్ద పెద్ద చిత్రాలను మంచిగా తీస్తారని చెప్పవచ్చు.

విజయ్ సేతుపతి పాత్ర:

విలక్షణ నటుడయిన విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎలా ఉందంటే కథ, కథనాలు ఎలా ఉన్నా ఉప్పెన సినిమాకు ప్రాణం పోసింది. అతని గెటప్, హావభావాలు తెర మీద అద్భుతంగా కనిపిస్తాయి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర పెంచి ఉంటే సినిమాకు హైలెట్ గా ఉండేది. ఇక విజయ్‌ సేతుపతి పాత్ర విషయానికి వస్తే అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు. ఈ విలక్షణ నటుడు అయిన విజయ్ సేతుపతి రాయణం అనే విలన్‌ పాత్రలో మునిగి పోయాడు. సేతుపతి యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. మొత్తంగా సినిమాకు బలం, బలహీనత విజయ్ సేతుపతే అని చెప్పవచ్చు.

వైష్ణవ్ తేజ్ నటన:

ఉప్పెన చిత్రం టాలీవుడ్ లో వైష్ణవ్ తేజ్ పరిచయానికి పరిపూర్ణమైన ప్రయోగంగా మారింది. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో అనుభవం ఉన్న హీరోగా నటించాడు. ఎక్కడా కూడా వైష్ణవతేజ్ కు తొలి చిత్రం అనే భావం రానివ్వకుండా, అనుభవం ఉన్న నటుడుగా చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఆశి అనే ఓ పేదింటి కుర్రాడి క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. అంతాలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌. సెకండాఫ్‌లో వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. తెలుగు చిత్రపరిశ్రమకు మెగా ఫ్యామిలీ నుండి మరో అద్భుతమైన నటుడు పరిచయం అయ్యారని చెప్పడానికి ఎటువంటి అనుమానం అవసరం లేదు.

కృతి శెట్టి నటన:

ఇక బేబమ్మ పాత్రకు ప్రాణం పోసింది కృతి శెట్టి. తొలి సినిమాయే అయినా.. చాలా అనుభవం ఉన్న హీరోయిన్‌లా నటించింది. బేబమ్మ పాత్రలో కృతిశెట్టి ఒదిగిపోయింది. ప్రతీ సన్నివేశంలో మెచ్యురిటీ ఉన్న నటిగా కనిపించింది. డైలాగ్స్ డెలివరీ, హావభావాలను స్పష్టంగా పలికించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విజయ్ సేతుపతితో పోటాపోటిగా నటించింది. తొలి చిత్రమైనా నటనపరంగా ఎక్కడా లోపాలు లేకుండా నటించారని చెప్పవచ్చు.

టెక్నికల్ విభాగాల పనితీరు:

ఉప్పెన సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ మ్యూజిక్. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా ఆలరించాయి. రీరికార్డింగ్‌ అద్భుతంగా ఉంది. షమాదత్ అందించిన సైనుద్దీన్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఆకర్షణ. నవీన్ నూలి చేతికి ఇంకా చాలా పని ఉంది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో వచ్చిన చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక పర్‌ఫెక్ట్‌గా ఉంది. అయితే మొదటి భాగంలో కథ, కథనాలు, నిడివి విషయంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి, జాగ్రత్తలు తీసుకొని ఉంటే, నో డౌట్ ఉప్పెన  మరో క్లాసిక్ హిట్ అయి ఉంటుంది.

ఫైనల్‌గా పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే రొటీన్ ప్రేమ కథా చిత్రం ఉప్పెన. మ్యూజిక్ ఈ సినిమాకు ప్రేక్షకులను భారీగా రప్పించే అవకాశం ఉంది. ఈ చిత్రం చూస్తున్నంత సేపు రంగస్థలం మరియు పలు సినిమాల కథలు, సీన్లు చూస్తున్నట్లుగా అనిపిస్తాయి. అయితే చివరిలో ఉండే కీలక పాయింట్ తో సినిమా కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. ఇంకొన్ని రోజులు ఆగితే చిత్రం ఫలితంపై స్పష్టమైన తీర్పు వస్తుంది.

బలం:

దర్శకుడి టేకింగ్,

విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్,

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి యాక్టింగ్,

సినిమాటోగ్రఫి,

మ్యూజిక్.

బలహీనతలు:

రోటీన్‌ స్టోరీ,

ఫస్టాఫ్‌లో స్లో నేరేషన్.

తెర వెనుక, తెర ముందు:

నటీనటులు: వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతిశెట్టి

రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సనా

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవి శంకర్

సినిమాటోగ్రఫి: షమాదత్ సైనుద్దీన్

మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్స్: మౌనిక రామకృప్ణ

సీఈవో: చెర్రీ

సమర్పణ: సుకుమార్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

x