“నారప్ప” మూవీ రివ్యూ

టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప. క్రైమ్ మరియు యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళ సూపర్ హిట్ సినిమా ‘అసురన్’ రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దీనిని తెరకెక్కించారు. ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయ్యింది. అసురన్ మూవీ చూడని వాళ్లకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అసురన్ మూవీ చూసిన వాళ్లకి కూడా నారప్ప పర్వాలేదనిపిస్తుంది.

సినిమా కథ:

ఈ సినిమాలో వెంకటేష్ వ్యవసాయం చేసుకునే ఒక సాధారణ మనిషి. కానీ, తన పెద్ద కొడుకు మాత్రం ఎప్పుడు కోపంతో ఊగి పోతూ ఉంటాడు. వెంకటేష్ కుటుంబానికి, పండు స్వామి కుటుంబానికి స్థలం విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవలో వెంకటేష్ పెద్దకొడుకు పండు స్వామిని చెప్పుతో కొట్టి అవమానిస్తాడు.

దీంతో పగ పెంచుకున్న పండు స్వామి.. తన మనుషులతో నారప్ప పెద్దకొడుకు ను హత్య చేయిస్తాడు. కొడుకును చంపేసిన కూడా నారప్ప ఏ మాత్రం ఎదురుతిరగడు. ఇది చూసినా చిన్న కొడుకు కోపంతో పండు స్వామిని చంపేస్తాడు. ఇక నారప్ప తన కొడుకు ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు..? పెద్ద కొడుకును చంపేసిన కూడా నారప్ప ఎందుకు ఎదురు తిరగలేదు..? వాళ్ళు వెంకటేష్ కుటుంబాన్ని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేదే మిగతా కథ.

సినిమా ప్లస్ పాయింట్స్:

ఇక ఈ సినిమాలో నారప్ప ఫ్లాష్ బ్యాక్ సినిమా మేజర్ హైలెట్ గా ఉంటుంది. చాలా వరకు కథ సింపుల్ గా అనిపించినా, చూసినప్పుడు మాత్రం ప్రతి సీన్ కు మనం కనెక్ట్ అయిపోతాము. ఒరిజినల్ సినిమాను కూడా మరిపించేలా విక్టరీ వెంకటేష్ తనదైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. మొదటి భాగంలో తన సహజ నటనతో మెప్పించాడు మరియు రెండవ భాగంలో కొన్ని యాక్షన్ సీన్స్ లో వింటేజ్ వెంకటేష్ ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ సీన్స్ థియేటర్స్ లో చూసి ఉంటే ఎంత బాగుండేదనిపిస్తుంది. ప్రియమణి ఫర్ఫార్మెన్స్ కూడా బాగుంది. రావు రమేష్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది.

మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే, నరేషన్, డైలాగ్స్ అన్ని కూడా ఒక డబ్బింగ్ సినిమాకి ఉన్నట్లు ఉండటం కొద్దిగా మైనస్ అని చెప్పవచ్చు. ఈ సినిమా పక్కా యాక్షన్ కథతో తెరకెక్కినప్పటికీ నరేషన్ మాత్రం స్లోగా ఉండటం ఈ సినిమాకి పెద్ద డ్రా బ్యాక్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉన్నట్లు కనిపిస్తాయి. మొదటి భాగం లో కొన్ని సీన్స్ అయితే రంగస్థలం సినిమాని గుర్తు చేశాయి. మొత్తంగా సినిమాలో కొన్ని సీన్స్ కొద్దిగా బెటర్ గా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ కలుగుతుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాల అన్నిటిలోను ఈ సినిమా పూర్తి డిఫరెంట్ గా ఉంది. క్లాస్ డైరెక్టర్ గా ఉన్న శ్రీకాంత్ అడ్డాల ఇక నుంచి మాస్ సినిమాలు కూడా చేయగలడు అని నిరూపించాడు. ఆయన నారప్ప క్యారెక్టర్ ను చాలా అద్భుతంగా ఎలివేట్ చేశాడు. నారప్ప సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా శ్యామ్ కె నాయుడు యాక్షన్ సీన్స్ ను తన కెమెరా యాంగిల్స్ తో ఓ రేంజ్ లో చూపించాడు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

సినిమా విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పవచ్చు. ఒరిజినల్ సినిమా చుసిన వారికి కొంచెం అక్కడక్కడ ఇబ్బందిగా అనిపించినా ఓవరాల్గా విక్టరీ వెంకటేష్ పర్ఫార్మెన్స్ తో మరోసారి ఈజీగా చూడవచ్చని అనిపిస్తుంది. కానీ, ఒరిజినల్ సినిమా చూడకుండా వెంకటేష్ నారప్ప సినిమా కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఈ సినిమా ఫుల్ మీల్స్ అందిస్తుందని చెప్పవచ్చు.

‘నారప్ప’ మూవీ రేటింగ్: 3/5
x