మోసపోయే వారు ఉన్నంతకాలం.. మోసం చేసే వాళ్ళు పుడుతూనే ఉంటారు.. పైగా దానికి నమ్మకం అనే ఒక పదాన్ని పెట్టుబడిగా పెట్టి నిలువున ముంచుతారు. ఓ మహిళ కూడా నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి భారీ స్కామ్ కు తెరలేపింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 45 కోట్ల రూపాయల స్కామ్ చేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

వివరాల్లోకి వస్తే, చీటీల మోసాలకు అనంతపురం జిల్లా కేరాఫ్ అడ్రస్ గా నిలించింది. చిత్రవిచిత్రమైన వ్యాపారాలతో నమ్మిన వారిని మోసం చేస్తున్నారు. మొన్నటికి మొన్న సునీల్ గ్యాంగ్ 300 కోట్లకు పైగా ముంచేసి పోతే, ఇప్పుడు హిందూపురం లో ఓ మహిళ ఏకంగా 45 కోట్ల రూపాయల స్కామ్ చేసి పరారైంది.

హిందూపురం పట్టణంలోని సత్యనారాయణ పేటలో విజయ లక్ష్మి అనే మహిళ చీటీలు మరియు అధిక వడ్డీకి డిపాజిట్ల సేకరణ చేస్తుంది. విజయలక్ష్మి తో పాటు ఆమె కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె వై.వి.ఏ (YVA) గ్రూపుల పేర్లతో డిపాజిట్ల సేకరణ చేసింది. పట్టణంలో సుమారుగా 20 ఏళ్లు నుంచి ఉన్న ఆమె ముందుగా చుట్టుపక్కల వారితో చీటీల బిజినెస్ స్టార్ట్ చేసింది.

ఆ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగడంతో, ఆమె అధిక వడ్డీలకు డిపాజిట్ల సేకరణ చేపట్టింది. విజయలక్ష్మి అంటే నమ్మకం.. నమ్మకం అంటే విజయలక్ష్మి.. అనే విధంగా బిజినెస్ ను మార్చింది. దీంతో డిపాజిట్ దారులకు అధిక వడ్డీ ఆశ చూపి వారిని దారుణంగా మోసం చేసింది.

మొదట్లో గడువు తీరిన వెంటనే చెప్పినట్లుగా సోమ్ము కచ్చితంగా ఇవ్వడంతో చాలామంది డిపాజిట్లు చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆమె వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసింది. హిందూపురం, పెనుకొండ, గోరంట్ల, బాగేపల్లి ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసింది. కొన్ని నెలల్లోనే వేలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించండి.

ఏడాదికాలంగా గడువు ముగిసిన ఖాతాదారులకు సొమ్ము చెల్లించకుండా విజయలక్ష్మి మొహం చాటేస్తుంది. అదేంటి అని ఖాతాదారులు అడిగితే డబ్బులు సిద్ధం చేస్తున్నానని, కొన్ని రోజులు ఆగితే మీకు బోనస్ గా వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికింది. కొన్ని రోజుల తర్వాత డిపాజిట్ దారులు సత్యనారాయణ పేటలోని ఆమె ఇంటివద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. అయితే, అప్పటికే విజయలక్ష్మి ఎస్కేప్ అయింది.

ఇంకేముంది బాధితుల ఆవేదనకు అంటూ లేకుండా పోయింది. బాధితుల్లో ప్రభుత్వ పెన్షన్ ల వారి నుంచి రోజువారీ కూలీల వరకు అన్ని వర్గాల వారు ఉన్నారు. విజయలక్ష్మి చేసిన మోసంతో ప్రస్తుతం పట్టణంలో చీటీలు మరియు గ్రూప్ డిపాజిట్ల నిర్వాహకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెల్లించిన సొమ్ము తిరిగి వస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి.

x