కరోనా కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా మారాయి. గతంలో థియేటర్స్ మూసివేసిన సమయంలో చాలా సినిమాలు ఓటిటి లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కావడంతో వాటిని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మంచి సమయం కోసం వేచి చూస్తున్నారు.
కానీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రస్తుతం ఓటిటి వైపు చూస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘విరాటపర్వం’ చిత్రాన్ని ఓటిటి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రానా హీరోగా నటించిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా కాలం నుంచి విడుదల వాయిదా వేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే, పెద్ద చిత్రాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్న ఈ చిత్రం మాత్రం ఇంకా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. దీంతో గతంలో వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 చిత్రాలను ఓటిటి విడుదల చేసినట్లుగానే ఈ సినిమాను కూడా ఓటిటి లో విడుదల చేయాలనే ఆలోచనలో సురేష్ బాబు ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ ఓటిటి సంస్థలు నెట్ ఫ్లెక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాతో పాటు సుధీర్ వర్మ డైరెక్షన్ లో సురేష్ బాబు నిర్మిస్తున్న ‘శాకిని డాకిని’ చిత్రం కూడా ఓటిటి లోనే విడుదల చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రెజీనా, నివేద థామస్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మార్చిలో రిలీజ్ అంటున్నప్పటికీ ప్రస్తుతం ఓటిటి బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. అయితే, ఈ ఓటిటి విడుదల విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది.