ఆన్లైన్ రమ్మీ లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మహిళలు కూడా ఈ ఆన్లైన్ గేమ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వారు లక్షల రూపాయలు పోగొట్టుకొని మోసపోతున్నారు. విశాఖలో ఇలాంటి ఘటనలు ఎన్నో బయటపడుతున్నాయి.
విశాఖలో పేకాటరాయుళ్ల తో పాటు పేకాట రాణులు కూడా తయారయ్యారు. జట్లు జట్లుగా ఏర్పడి కాలక్షేపం కోసం రమ్మీ గేమ్ ను ఆడుతున్నారు. బయట అయితే, పోలీసులకు పట్టుబడితే ప్రమాదం ఉందని రమ్మీ కి సంబంధించిన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇంట్లోనే పేక ముక్కలను తిరగేస్తున్నారు.
ఈ సంస్కృతి చాలాకాలం గా ఉన్నప్పటికీ ఈ మధ్య మరింత జోరందుకుంది. ఆన్లైన్ రమ్మీ గేమ్లో ఇటీవల “సీతమ్మదార కు చెందిన ఒక మధ్యతరగతి మహిళ 2.5 లక్షలు పోగొట్టుకుంది” ఇలాంటి వారు చాలా మంది ఉన్నా పరువు పోతుందని బయటికి రాలేక పోతున్నారు. కరోనా టైమ్ లో చాలామంది ఇళ్లలోనే గడుపుతున్నారు. లాక్ డౌన్ లో ఏం చేయాలో తెలియక కాలక్షేపం కోసం రమ్మీ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
రోజులు గడిచే కొద్దీ దానికి బానిసలుగా మారిపోతున్నారు. చాలామంది లక్షలాది రూపాయలను పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. పురుషులతో సమానంగా మహిళలు ఆన్లైన్ రమ్మి ఆడుతూ ఉండటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన వారితో పాటు మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళలు కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఆన్ లైన్ లో పేకాట ఆడుతున్నారు.
భారీ మొత్తంలో బెట్టింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో ఆడుతూ ఉండటం వల్ల సమాచారం రాబట్టటం కొంత కష్టం కాబట్టి ప్రజలే ఇటువంటి వాటిని తమ దృష్టికి తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.