జనెటి ట్రైన్ మిస్టరీ

అది జులై 14, 1911 వ సంవత్సరం. మూడు బోగీలు, 106 మంది ప్రయాణికులతో ఓ ట్రైన్ నెమ్మదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ట్రైన్ మెల్లగా స్పీడ్ అందుకుంటుంది. ట్రైన్ తన ప్రయాణంలో ముందుకు సాగిపోతూ ఒక సొరంగం లోకి ప్రవేశించండి. అంతే, ఇంకా ఆ ట్రైన్ ఎవరికీ కనిపించలేదు. అందులో ఉన్న ప్రయాణికులు అసలు ఏమయ్యారో వారి ఆచూకి ఇంతవరకు ఎవరికి తెలియలేదు. ఇది కథ కాదు.. ఇటలీలోని రోమ్ నగరంలో జరిగిన ఒక యదార్థ సంఘటన..

106 మంది ప్రయాణికులతో బయలుదేరిన జనెటి ట్రైన్:

వివరాల్లోకి వెళ్తే, 1911వ సంవత్సరంలో ఇటలీలో జనెటి అనే కంపెనీ.. మూడు బోగీలు కలిగిన కొత్త రకం ట్రైన్‌ను ప్రవేశపెట్టింది. ఉచితంగా తమ ట్రైన్‌లో ప్రయాణించడానికి ఇటలీ లో ఉన్న ధనికులను ఆహ్వానించింది. దీంతో చాలా మంది ఆ జనెటి ట్రైన్ లో ప్రయాణించడానికి వచ్చారు. అయితే, ఆ కంపెనీ మాత్రం వారిలో ఒక 100 మందిని సెలెక్ట్ చేసింది. చివరికి 100 మంది ప్రయాణికులు.. ఆరుగురు రైల్ సిబ్బందితో మొత్తం 106 మంది తమ ప్రయాణాన్ని రోమన్ రైల్వే స్టేషన్ నుంచి మొదలుపెట్టారు.

Zanetti Train Mystery

ఆ ట్రైన్ అందమైన కొండలు, గుట్టలను దాటుకుంటూ పోతుంది. ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ, ట్రైన్ లో ఏర్పాటు చేసిన స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఓ పర్వత ప్రాంతం మీదుగా పోతున్న ఆ ట్రైన్‌ కొంచం సేపట్లో అతి పొడవైన సొరంగ మార్గం లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఆ సొరంగం పొడువు దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుంది. చివరికి ఆ ట్రైన్ సొరంగంలోకి ప్రవేశించింది.

ఆ సొరంగంలో ఏం జరిగింది?

Zanetti Train Mystery

ఆ ట్రైన్ కాసేపట్లో తన గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉంది. కానీ, సొరంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆ ట్రైన్ కనిపించలేదు. దీంతో ఆ సొరంగంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే అధికారులు భావించి అక్కడికి రైల్వే కార్మికులను మరియు పోలీసులను పంపించారు. వారందరు ఆ సొరంగం మొత్తం గాలించారు. కానీ, అక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినట్లు కనిపించలేదు.

ఈ సంఘటన జరిగి దాదాపు 110 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఇప్పటికీ ఆ ట్రైన్ ఆచూకీ మాత్రం ఎవరికీ తెలియలేదు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే, ఆ సొరంగం పొడవైన గొట్టం ఆకారంలో ఉంటుంది. ఆ సొరంగం లోకి ఏ దారిలో వెళ్ళామో, మళ్ళీ అదే దారిలో బయటికి రావాలే తప్ప దానికి మరో మార్గం కూడా లేదు. అలాంటప్పుడు ఆ ట్రైన్ ఎలా కనిపించకుండా పోతుంది. ఆ ట్రైన్ కనిపించకుండా పోవడానికి అది చిన్న వస్తువు కాదు కదా..! ఆలా ఎలా కనిపించకుండా పోతుందని చాలా మంది తలలు పట్టుకున్నారు. సరిగ్గా అప్పుడే ఆ ట్రైన్‌ లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు ట్రైన్ అదృశ్యం అవటానికి కొన్ని క్షణాల ముందే ట్రైన్ లో నుంచి బయటికి దూకేశారని అని తెలిసింది.

ఆ ఇద్దరు ప్రయాణికులు చెప్పింది ఏమిటి?

ట్రైన్ నుంచి దూకిన ఆ ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చేరారు. వారు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. వారు కోలుకున్నాక చెప్పింది ఏమిటంటే, ఆ ట్రైన్ సొరంగమార్గం లోకి ప్రవేశించగానే ఓ వైపు నల్లటి పొగ మరోవైపు తెల్లటి పొగ ట్రైన్ ను ఒక్కసారిగా కమ్మేసిందని, ఆ సమయంలోప్రయాణికులు అందరు పెద్దపెద్దగా అరవడం తో మాకు భయం వేసి దూకేశామని చెప్పారు.

అలా దూకిన ఆ ఇద్దరు ప్రయాణికులు చాలా సంవత్సరాలు మానసిక సమస్యలతో సతమతమయ్యారు. ఇక ట్రైన్ లో ఉన్న 104 మంది ప్రయాణికులు ఏమయ్యారు అనేది ఇప్పటికీ తెలియలేదు. ఒకవేళ సొరంగం లో ఏదైనా ప్రమాదం జరిగినా దాని అవశేషాలు అయినా కనిపించాలి. కానీ అక్కడ ట్రైన్ కు సంబంధించిన అవశేషాలు గాని, ప్రయాణికుల శరీరాలు గాని కనిపించలేదు.

పట్టాల పై మాత్రమే నడిచే రైలు ఒక్కసారిగా ఎలా మాయమవుతుంది. అసలు ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్లింది..? అందులో ఉన్న 104 మంది ప్రయాణికులు ఏమయ్యారు..? అంటూ అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. మరోపక్క కొంతమంది ఇదంతా దయ్యల పనే అని కథలు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జనెటి ట్రైన్ కాస్త ఘోస్ట్ ట్రైన్ గా పేరు మారిపోయింది. దీంతో ప్రభుత్వం ఆ సొరంగ మార్గాన్ని మూసేసింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బాంబు దాడుల్లో ఆ సొరంగం పూర్తిగా మూసుకుపోయింది.

71 సంవత్సరాలు వెనక్కి..

ఇటలీ ప్రజలు ఈ ట్రైన్ పై మరియు ట్రైన్ లోని ప్రయాణికులపై ఆశలు వదిలేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు తర్వాత 1926లో అంటే సుమారు 15 సంవత్సరాల తర్వాత ఈ జనెట్టి ట్రైన్ కి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఇటలీ తో పాటు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ విషయం ఏమిటంటే, 1911లో అదృశ్యమైన ఆ ట్రైన్ బాలకృష్ణ గారి ఆదిత్య 369 సినిమా లోని టైమ్ మిషన్ మాదిరిగా, ఆ ట్రైన్ కూడా 104 మంది ప్రయాణికులను ఏకంగా 71 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. అంటే 1840 వ సంవత్సరానికి, అది కూడా ఇటలీ దేశానికి కాదు, మెక్సికో దేశానికి చేరుకుందని మీడియా నివేదికలు వెల్లడించాయి .

1840 వ సంవత్సరంలో అప్పటి మెక్సికో అధికారులు వీరి దుస్తులను, మాట్లాడే భాషను మరియు వారి ప్రవర్తనను చూసి వారి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించగా, ఆ 104 మంది ప్రయాణికులు చెప్పినది ఒకటే. మేమంతా ఇటలీ లోని రోమ్ నగరానికి చెందిన వాళ్ళము. అక్కడ కొత్తగా ప్రారంభించిన జెనటి ట్రైన్ లో ఎక్కడం వల్ల మేము ఇక్కడకు వచ్చాము. మేము 1911వ సంవత్సరానికి చెందిన వాళ్ళము. ఆ ట్రైన్ మమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చిందని చెప్పారు. ఆ మాటలు విన్న మెక్సికో అధికారులు షాక్ కి గురయ్యారు.

ఆ ప్రయాణికులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇటలీ లోని రోమ్ నగరం నుండి ఇక్కడికి అంటే మెక్సికోకు ట్రైన్ లో వచ్చామని చెప్పారు. కానీ, 1840 వ సంవత్సరంలో ఇటలీకి మెక్సికో కి మధ్య రైలు మార్గం అనేదే లేదు. ఆ సమయంలో ఇటలీకి మెక్సికో కి మధ్య సముద్ర మార్గం ఒక్కటే ఉంది. అలాంటిది మీరు ట్రైన్ లో ఇక్కడికి ఎలా వస్తారు.. అంటూ మెక్సికో అధికారులు వీరందరికి పిచ్చి పట్టిందేమో అనే ఉద్దేశంతో ఈ 104 మందిని హాస్పిటల్ లో చేర్పించారు.

Zanetti Train Mystery

మెక్సికో అధికారులకు 104 మంది ప్రయాణికులల్లో ఒకరి దగ్గర ఒక సిగరెట్ పెట్టె దొరికింది. ఆ పెట్టె పైన తయారీ వివరాలు చూసి వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ సిగరెట్ పెట్టె 1907వ సంవత్సరం నాటిది. దాంతో వీరు నిజంగా భవిష్యత్ నుంచి ఇక్కడకు వచ్చారని అధికారులు భావించారు. కానీ, ఈ లోపే ఆ 104 మంది హాస్పిటల్ నుంచి ఒక్కసారిగా మాయమైపోయారు. దీంతో అప్పటి మెక్సికో అధికారులకు అసలు ఏం జరుగుతుందో ఏ మాత్రం అర్థం కాలేదు.

కానీ, వారికీ లభించిన 1907వ సంవత్సరం నాటి సిగిరెట్ పెట్టెను ఆ అధికారులు మెక్సికోలోని ఓ మ్యూజియంలో భద్రపరిచారు. అది నేటికి కూడా మ్యూజియంలో ఉండని నివేదికలు తెలుపుతున్నాయి. ఇలా ఈ ట్రైన్ మరియు ఆ 104 మంది ప్రయాణికులు ఒక్క మెక్సికో లోనే కాదు, మెక్సికో తో పాటు రష్యా, జర్మనీ, ఇటలీ మరియు ఇండియాలో కూడా వేరు వేరు సంవత్సరాల్లో కొందరికి కనిపించినట్లు ఎన్నో వార్తలు వచ్చాయి.

44 సంవత్సరాలు ముందుకు వెళ్లిన ట్రైన్

ఈ ట్రైన్ కేవలం గతంలోని వారికి మాత్రమే కాదు, భవిష్యత్తులోని వారికి కూడా కనిపించింది. 1911 జూన్ 14న అదృశ్యమైన ఈ ట్రైన్ యూరోప్ లో 1955వ సంవత్సరం అక్టోబర్ 29న ఉక్రెయిన్ లోని ఓ చిన్న రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి సమయంలో ఈ ట్రైన్ కనిపించినట్లు అక్కడ పనిచేసే స్టేషన్ మాస్టర్ చెప్పారు. ఆ స్టేషన్ మాస్టర్ చెప్పింది ఏమిటంటే, అర్ధరాత్రి సమయంలో ఆ ట్రైన్ ఎలాంటి శబ్దం చేయకుండా వెళ్లిందని, ఆ ట్రైన్ పట్టాల మీద వెళ్ళకుండా పక్కనే ఉన్న గ్యాస్ పోర్ట్ మౌంటెన్ లోకి వెళ్లి పోవడం చూసి అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తర్వాత ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు.

ఐతే, ఈ ట్రైన్ చాలా దేశాల్లో కనిపించినట్లు అనేక వార్తలు వచ్చాయి. మరోపక్క చాలామంది శాస్త్రవేత్తలు ఈ ట్రైన్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామని ప్రయత్నించారు. కానీ, ఎలాంటి ఫలితం లేదు. అయితే, 110 సంవత్సరాలు దాటినా ఈ ట్రైన్ మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

x